Saturday, April 23, 2016

Nail art fashion tips


ఫ్యాషన్ అనగానే డ్రెస్సులు, హెయిర్ స్టయిల్, జ్యూయెలరీ అంటూ ఆలోచిస్తామే తప్ప... గోళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకోం.  పెరిగితే కత్తిరిస్తాం. ఏదో ఒక రంగు నెయిల్ పాలిష్ పూసేస్తాం.Nail art fashion tips అక్కడితో వాటిని వదిలేస్తాం. కానీ అది కరెక్ట్ కాదు అంటారు ఫ్యాషన్ నిపుణులు. అందంగా తీర్చిదిద్దితే నఖసౌందర్యం మిగతా వాటన్నిటినీ తీసి పారేస్తుంది అంటారు వాళ్లు. అందుకే ఇటీవలి కాలంలో నెయిల్ ఆర్ట్ ప్రాధాన్యతను సంతరించు కుంటోంది. మరి ఆ కళలో మీరెందుకు వెనకబడాలి! వారానికో కొత్త డిజైన్ నేర్చేసుకోండి.
 
ఈ డిజైన్ కోసం కావలసినవి నాలుగు రంగుల నెయిల్ పాలిష్‌లు... నీలం, నలుపు, తెలుపు, సిల్వర్. అయితే ఇవే రంగులు వేయాలని లేదు. ఏ రంగులైనా ఎంచుకోవచ్చు. కాంబినేషన్‌ను జాగ్రత్తగా ఎంచుకుంటే సరిపోతుంది.
 
1. ముందుగా గోరు మీద బ్లూ కలర్ నెయిల్ పాలిష్‌ను వేయాలి.
 
2. తర్వాత తెలుపు రంగు పాలిష్‌ను తీసుకుని 2వ నంబర్ ఫొటోలో చూపినట్టు క్రాస్‌గా పూయాలి.
 
3. బ్లాక్ నెయిల్ పాలిష్‌ను తీసుకుని, తెలుపు రంగు ఉన్న భాగంపై చారలుగా వేసుకోవాలి.
 
4. నల్లని చారలపైన, నీలం-తెలుపు కలిసిన చోట సిల్వర్ కలర్ పాలిష్‌ను సన్నగా పూయాలి.
 
5. రంగు బాగా ఆరిపోయిన తర్వాత అన్నిటి మీద మరొక పూత పూయాలి.

Badam cut Blouse stitching tips

చీర కట్టు చూస్తే ముందు వైపే కాదు, వెనుక కూడా గొప్పగా ఉండాలి. ఈ మార్పు ‘కట్టు’లో కాకుండా ‘కట్’లో చూపించాలనేదే డిజైనర్ల తాపత్రయం. అందుకే, బ్లౌజ్ కట్స్‌లో ‘బ్యాక్’ డిజైన్స్ వందల సంఖ్యలో వెలిగిపోతున్నాయి. వాటిలో ముందు వరుసలో ఉన్న నెక్ ప్యాటర్న్ ‘బాదం కట్!’

ఈ బ్యాక్ నెక్ లైన్ డిజైన్ బాదం గింజ ఆకృతిలో ఉంటుంది కనుకనే దీనికి ‘బాదం కట్’ అనే పేరు వచ్చింది. బోట్‌నెక్ ముందు-వెనుక నెక్‌లైన్ మెడకు దగ్గరగా ఉంటుంది. అదే బాదం నెక్‌కి అయితే ముందు భాగంలో రౌండ్ కట్ వస్తుంది. వెనుక వైపు మెడ దగ్గర ఓపెన్ ఉంటుంది. మెడ మీదుగా రెండు విడి భాగాలను కలపడానికి అదే రంగు క్లాత్‌తో తాడులా కుట్టి, చివరలో హ్యాంగింగ్స్‌ను వేలాడదీస్తారు. బ్లౌజ్ ధరించినప్పుడు ఈ రెండు తాళ్లనూ కలిపి ముడివేస్తారు. బ్యాక్ నెక్ ఓపెన్ కట్ చతుర స్రాకారం, త్రికోణాకారం, రౌండ్... ఇలా వందల రకాల డిజైన్స్‌ని సృష్టించారు డిజైనర్స్.

బ్లౌజ్ మార్కింగ్ ఉదాహరణకు:

34 ఛాతి చుట్టుకొలత గలవారి నమూనా బ్లౌజ్‌ను మార్క్ చేసి, కట్ చేద్దాం.
పేపర్‌చార్ట్‌ను నిలువుగా, తిరిగి మధ్యకు మడవాలి.
ముందు భాగం (భుజం నుంచి - నడుం వరకు నిలువుగా) స్టాండర్డ్ లెంగ్త్ 14 1/2 అంగుళాలు ఉండేలా చూసి మార్క్ చేయాలి. అలాగే వెనుకభాగం 13 అంగుళాలు కొలిచి మార్క్ చేయాలి.
నడుము చుట్టుకొలత (ఛాతికి కింది భాగం) ముందు భాగం 14, వెనుకభాగం 14 అంగుళాలు ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇది మొత్తం 28 అంగుళాలు ఉండేలా మార్క్ చేసుకోవాలి.
భుజాల పై భాగం (చంక నుంచి మెడ వరకు) 6 1/2 అంగుళాలు.
షార్ట్ స్లీవ్స్ (పొట్టి చేతులు) అయితే 4 అంగుళాలు.
ఆర్మ్ హోల్ (చంకభాగం) - 8 1/2 (ముందు ఔ మార్క్ డ్రా చేసి అటు తర్వాత గుండ్రటి వంపు తీసుకోవాలి)
ఛాతి భాగం వద్ద డార్ట్స్ డ్రాఫ్టింగ్ పాయింట్స్ డ్రా చేయాలి.

నెక్ భాగం...

వెనుక వైపు నెక్ డీప్‌గా కిందివైపు వంపుగా వస్తుంది. ఈ సైజు ముందు మెడ భాగం నుంచి - 10 1/2 అంగుళాలు మార్క్ చేయాలి. (భుజం దగ్గర నుంచి కిందకు కర్వ్ తీసుకుంటూ మార్క్ చేయాలి) ఫ్రంట్ నెక్ 8 1/2 అంగుళాలు కొలిచి, మార్క్ చేయాలి.

కట్ చేద్దాం...

కొలతల ప్రకారం చాప్‌స్టిక్ మార్క్ మీదుగా తేడా లేకుండా కట్ చేయాలి.
ముందువైపు చెస్ట్ పార్ట్ మధ్యకు డ్రా చేసి, సమంగా కట్ చేయాలి. అంటే, 34 లో సగం 17 అంగుళాల కొలత తీసుకొని కట్ చేయాలి.
కొలతలు తీసుకున్న ప్రకారం భుజాలు, చంకభాగం, డ్రాఫ్ట్ పాయింట్స్, చేతులు కట్ చేయాలి.
వెనుక వైపు డీప్ నెక్ కొలత తీసుకున్నదాని ప్రకారం మెడ నుంచి కిందవైపుగా కర్వ్ లైన్ వచ్చేలా కట్ చేయాలి. ఇది పూర్తిగా బాదం కట్ షేప్ వస్తుంది.

జాకెట్ క్లాత్‌ను కట్ చేయడం ఇలా!

ఎంచుకున్న జాకెట్ క్లాత్‌ను పేపర్ మడిచిన విధంగానే నిలువుగా మధ్యకు మడవాలి. దానిని తిరిగి మధ్యకు మడిచి టేబుల్ మీద ముడతలు లేకుండా సరిచేయాలి.
దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాలను ఉంచాలి.
దీని ప్రకారం క్లాత్‌ను జాగ్రతగా కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా 1 1/2 అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి).
కొలతల ప్రకారం మార్క్ చేసుకున్నదాని మీదుగా కుట్టు అటూ ఇటూ కాకుండా జాగ్రత్తపడుతూ స్టిచ్ చేయాలి.
బ్యాక్‌నెక్ బాదం కట్‌కి హెమ్మింగ్ అవసరం లేకుండా పైపింగ్ చేయడం వల్ల నెక్‌లైన్ అందంగా, నీటుగా వస్తుంది.


Wednesday, May 13, 2015

MODI VISITS CHINA


ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సౌహార్ధ్ర సంబంధాల విషయంలో తన China పర్యటన ఒక మైలురాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. తన పర్యటనతో Bharat/India, China సంబంధాలు మరింత విస్తృతమవుతాయన్నారు. చైనాలో ప్రధాని హోదాలో మోదీ 3 రోజుల తొలి పర్యటన కోసం బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. protocol కు భిన్నంగా రాజధాని బీజింగ్ నుంచి కాకుండా చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ సొంత నగరమైన గ్జియాన్ (షాంగ్జి రాష్ట్ర రాజధాని) నుంచి మోదీ చైనా పర్యటన ప్రారంభం కావడం విశేషం. అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తరువాత బీజింగ్ వెలుపల ఒక విదేశీ నేతకు జిన్‌పింగ్ స్వాగతం పలకడం ఇదే ప్రథమం. భారత పర్యటన సందర్భంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో జిన్‌పింగ్‌కు మోదీ ఘనంగా స్వాగతం పలికిన విషయం  తెలిసిందే.
 
  గ్జియాన్‌లో మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య గురువారం అనధికార చర్చలు జరుగుతాయి. ‘చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం భారత్, చైనాలు కలసికట్టుగా కృషి చేయాల్సి ఉంది.’ అని చైనా అధికార వార్తా సంస్థ సీసీటీవీతో మోదీ వ్యాఖ్యానించారు. చైనా మీడియాను బుధవారం మోదీ కలిశారు. ‘ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం మరింత లోతుగా పాదుకొనడంపైననే ప్రధానంగా దృష్టి పెట్టనున్నాను. అప్పుడే ద్వైపాక్షిక సంబంధాల వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీయడం సాధ్యమవుతుంది.’ అని మోదీ వ్యాఖ్యానించారు. బుద్ధుడు జన్మించిన ఆసియాలో ఈ శతాబ్దాన్ని  యుద్ధరహిత శతా బ్దంగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
 
Pagoda సందర్శన: మోదీని ప్రఖ్యాత బౌద్ధ నిర్మాణం Pagoda సందర్శనకు కూడా జిన్‌పింగ్ తీసుకెళ్లనున్నారు. చైనాలో బౌద్ధం వ్యాప్తికి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసి జువాన్ జాంగ్స్ చేసిన కృషికి గుర్తుగా క్రీశ 6వ శతాబ్దంలో ఈ పగోడాను నిర్మించారు. చైనా నుంచి చరిత్రాత్మక సిల్క్ రూట్ ద్వారా క్రీశ 645లో జాంగ్స్ భారత్‌కు వచ్చి, 17 ఏళ్లు ఇక్కడే గడిపారు. మోదీ గౌరవార్ధం జిన్‌పింగ్ ఇచ్చే విందు కు ముందు మోదీకి చైనాను పాలించిన తాంగ్ వంశ సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలుకుతారు. గ్జియాన్ నుంచి మోదీ బీజింగ్ వెళ్లి, చైనా ప్రధాని లి కెక్వియాంగ్‌తో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతారు.
 
 Border సమస్య: చైనాతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్య, పాక్‌కు చైనా అన్ని విధాలుగా అందిస్తున్న సాయం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా నిర్మిస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు..! చైనా, భారత్‌ల సంబంధాలను ప్రభావితం చేసే ఈ అంశాలివి. చైనా నాయకత్వంతో మోదీ బృందం జరిపే చర్చల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాలు ఇటీవలి కాలంలో కృషి చేస్తున్నప్పటికీ.. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్సాయిచిన్ ప్రాం తంలోని 2 వేల కిమీలకే సరిహద్దు సమస్య పరిమితమని చైనా వాదిస్తుండగా, 1962 యుద్ధం సమయంలో చైనా ఆక్రమించుకున్న పశ్చిమ ప్రాంతంలోని 4 వేల కిమీలు సమస్యాత్మకమేనని భారత్ పేర్కొంటున్నది. కాగా, భారత్‌తో సరిహద్దు సమస్య ఒక్కరోజులో పరిష్కారమయ్యేది కాదని చైనా పేర్కొంది.  
 
 మోదీ పాల్గొనే కార్యక్రమాలు
 -    బీజింగ్‌లో భారత్, చైనాల రాష్ట్రాధినేతల సమావేశంలో మోదీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌ల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, ఆనందిబెన్ పటేల్‌లు పాల్గొంటారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ.. ఆయన పర్యటన రద్దయింది.
 -    Temple of Heaven వద్ద యోగా-తాయిల సమ్మిళిత కార్యక్రమంలోనూ మోదీ పాల్గొంటారు. T singhua University  విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. Shanghai లో వ్యాపార సంస్థల CEO భేటీలో పాల్గొంటారు.
 మంగోలియాలో..
 -    May 17న Mangolia చేరుకుంటారు.  అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగిస్తారు.
 -    మంగోలియా అధ్యక్షుడు సఖియాగ్జిన్ ఎల్బెగ్‌డోర్జ్‌తో చర్చలు జరుపుతారు.
 -    చివరగా, మంగోలియా నుంచి South Korea వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు పార్క్ గ్వెన్‌హైతో చర్చలు జరుపుతారు

Wednesday, March 12, 2014

Hyderabada have special place in aviation


Governor 
  విమానరంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందని అయితే టెక్నాలజీ పరంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన ప్రదర్శనను గవర్నర్, కేంద్రం మంత్రి అజిత్‌సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీలో మన దేశం వెనకబడి ఉందని, ఇలాంటి ప్రదర్శనలతో మనదేశానికి గుర్తింపు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు దేశానికే తలమానికమని ఆయన కొనియాడారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గవర్నర్

Thursday, October 31, 2013

థైరాయిడ్ కేన్సర్‌కు హైదరాబాద్ లోనూ అమెరికా తరహా చికిత్స -



భారతదేశంలో థైరాయిడ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య మిగిలిన క్యాన్సర్ బాధితుల సంఖ్యతో పోలిస్తే 0.1 శాతం నుంచి 0.2 శాతం మాత్రమే ఉంటుంది. లక్ష మందిలో ఒక పురుషుడికి, 1.8 మహిళలకు ఇది రావడం జరుగుతోంది. అదే అమెరికాలో అయితే, 2013 నాటికి ఇటువంటి క్యాన్సర్ బాధితుల సంఖ్యలో కొత్తగా 60,220 మంది చేరే అవకాశం ఉందని అంటున్నారు. థైరాయిడ్ క్యాన్సర్ సాధారణంగా థైరాయిడ్ గ్రంథిలో ప్రారంభమవుతుంది. ఈ రకం క్యాన్సర్‌లో నాలుగు రకాలున్నాయి. వీటిని పాపిలరీ, ఫోలిక్యులర్, మెడ్యులరీ, అనాప్లాస్టిక్ అనే నాలుగు రకాలుగా పిలుస్తున్నారు. మైక్రోస్కోప్‌లో ఈ క్యాన్సర్ ఎలా కనిపిస్తుందన్నది ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు.

నిజానికి ఇతర క్యాన్సర్‌ల మాదిరిగానే ఈ క్యాన్సర్ కూడా భారతదేశంలో కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఇది అన్ని రకాల వయసు వాళ్లలోనూ కనిపిస్తున్నప్పటికీ, మహిళల్లో మాత్రం ఎక్కువగా వచ్చే అయిదవ క్యాన్సర్‌గా నమోదైంది. థైరాయిడ్ గ్రంథి ఆహార నాళికకు కొద్దిగా పైన ఉంటుంది. ఇది శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడుతోంది. ఇక గుండె సమస్యల మీదా, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, బరువు వంటి వాటి మీద దీని ప్రభావం ఉంటుంది.

కాగా, మొత్తం థైరాయిడ్ క్యాన్సర్లలో పాపిలరీ, ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్‌ల శాతమే ఎక్కువ. ఇది 80 నుంచి 90 శాతం వరకూ ఉండొచ్చని అంచనా. అయితే, వాటికి చికిత్సను అందించడం, వాటిని అదుపు చేయడం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ప్రాథమిక దశలోనే గుర్తించగలిగిన పక్షంలో, పాపిలరీ, ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్‌లను నయం చేయడo  సాధ్యమవుతుంది.
 
చికిత్సలో భాగంగా, వ్యాధి పరిస్థితిని బట్టి రేడియోయాక్టివ్ చికిత్స అవసరమవుతుంది. ఇక మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్లలో 5 నుంచి 10 శాతం వరకూ ఉంటుంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ రావడమనేది చాలా తక్కువే కానీ, దీన్ని అదుపు చేయడం, దీనికి చికిత్స చేయడం కాస్తంత కష్టమనే చెప్పాలి.థైరాయిడ్ క్యాన్సర్లకు ఇదమిత్థంగా ఇదీ కారణమని చెప్పలేకపోతున్నారు. కుటుంబ చరిత్ర, ఇదివరకు వచ్చిన థైరాయిడ్ సమస్యలు, ముఖ్యంగా గాయిటర్, థైరాయిడిటీస్ వంటివి ఈ క్యాన్సర్ రావడానికి కొంతవరకూ అవకాశమిస్తున్నాయి. మెడను ఎక్కువగా రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్ చేయడం కూడా ఈ క్యాన్సర్ రావడానికి దారి తీయవచ్చు. చాలామంది రోగులు మొదట్లో ఈ క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ఈ క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు లేదా వ్యాపిస్తున్నప్పుడు, మెడ ముందు భాగంలో ఓ ఉండలాగా కనిపించడం, గొంతు బొంగురుపోతుండడం, మాట్లాడడానికి ఇబ్బందిగా ఉండడం, మెడలోని నాళాలు వాయడం, మింగడానికి, గాలి పీల్చడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం, , మెడ లేదా గొంతు నొప్పిపెడుతుండడం వంటివి దీని ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి.
 
 గొంతు లేదా మెడ భాగంలో థైరాయిడ్ నాడ్యూల్స్ వాయడం వంటివి సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే, ఇందులో అయిదు శాతం మాత్రమే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. ఈ థైరాయిడ్ నాడ్యూల్‌ను పరిశీలించడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. అందులో ముఖ్యమైనవి

-- శరీర పరీక్ష, లారింజియల్ పరీక్ష ఇందులో ప్రధానమైనది. అంటే అన్నవాహికను, స్వరపేటికలను ఆరంభం నుంచి పరీక్షించడం జరుగుతుంది.

- మెడకు అల్ట్రాసౌండ్ పరీక్ష.-ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ (ఎఫ్.ఎన్.ఎ) బయాప్సీ...అల్ట్రాసౌండ్ గైడెన్స్ విధానంలో.

- థైరాయిడ్ పనితీరుపై లాబ్ టెస్టులు, రక్తపరీక్షలు.- ఛాతీకి ఎక్స్‌రే.- సీటీ - అయోడిన్ కాంట్రాస్ట్ లేకుండా. లేక ఇతర ఇమేజింగ్ పరీక్షలు.

- అతి తక్కువ మోతాదులో రేడియోయాక్టివ్ అయోడిన్ లేదా టెక్నీషియమ్ పరీక్షలతో థైరాయిడ్ స్కానింగ్ అవసరం.

- మాలిక్యులర్ మార్కర్లతో ఇతర రక్త పరీక్షలు... మధ్య మధ్య థైరాయిడ్ నాడ్యూల్స్ పరీక్షలు.

ఇందులో ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ పరీక్ష చాలా ఆధారపడదగింది. ఈ రకంక్యాన్సర్ ఉందా లేదా అన్నది దీని ద్వారానే నిర్ధారించుకోవచ్చు. శరీరంలో థైరాయిడ్ క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందీ నిర్ణయించేది, ఏ విధమైన చికిత్స అవసరమన్నది నిర్ణయించేది డాక్టర్లే. థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ ప్రారంభమైందని తేలిన తరువాత, డాక్టర్లు వైద్యం ప్రారంభిస్తారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ అండ్ సిటిజెన్స్ హాస్పిటల్‌లో ఈ క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ప్రతిభావంతులైన డాక్టర్లతో పాటు, పరీక్షలకు, రోగ నిర్ధారణకు అద్భుతమయిన ఆధునిక పరికరాలెన్నో ఉన్నాయి. అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ (ఎ.టి.ఎ), నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్‌వర్క్ సంస్థల మార్గదర్శక సూత్రాల ప్రకారమే ఇక్కడ చికిత్సలు జరుగుతాయి.
 
మీ శరీర పరిస్థితికి తగ్గట్టే ఇక్కడ చికిత్సలు చేపట్టడం జరుగుతుంది. ఎటువంటి థైరాయిడ్ క్యాన్సర్‌కైనా, సాధారణంగా సర్జరీ మొదటి అడుగు అవుతుంది. ఎక్కువగా థైరాయిడెక్టమీ, అంటే థైరాయిడ్‌ను తొలగించడం, ప్రామాణికమైన సర్జరీ. అయితే, కంతులు గనుక బాగా చిన్నవిగా ఉంటే, హెమిథైరాయిడెక్టమీ అంటే సగం గ్రంథిని మాత్రమే తొలగించడం ద్వారా దీన్ని తగ్గించడం జరుగుతోంది. ఒకవేళ థైరాయిడ్ గ్రంథిని తొలగించాల్సి వస్తే, థైరాయిడ్ హార్మోన్ మార్పిడి చికిత్సను అందించడం జరుగుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.మొత్తం మీద థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ కారకాలన్నిటినీ తొలగించడమే ఈ ప్రతిష్ఠాత్మక సంస్థ ప్రధాన ధ్యేయం. ఇక్కడ ఉన్న కొన్నిరకాల చికిత్సా పద్ధతుల్లో ఒకదానికి రోగి పరిస్థితిని బట్టి ప్రారంభించడం జరుగుతుంది. చికిత్స పూర్తయిన తరువాత కూడా ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా, రోగి ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించేవిధంగా చికిత్స జరుగుతుంది.


 
 

Wednesday, February 20, 2013

Phobias


భయం చాలా స్వాభావికమైన లక్షణం. అది అందరికీ సహజంగా ఉండేదే. ఉదాహరణకు నేల మీద ఎలుకలు తిరుగుతుంటే చాలామంది భయపడతారు.అలాగే ఎలాంటి హానీ చెయ్యకుండా గోడ మీద బల్లులు తిరుగుతున్నా చాలా మందికి అవంటే భయమే! ఏదయినా భయం అర్థం లేనిదై, అది యాంగ్జైటీని కలిగిస్తూ... మీ దైనందిన వ్యవహారాలను సాగనియ్యనంత తీవ్రంగా ఉంటే దాన్ని‘ఫోబియా’ అంటారు. గతంలో ఫోబియాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు వీటిని పూర్తిగా తగ్గించవచ్చు. ఫోబియాల కథా కమామిషులతో పాటు వాటి చికిత్స ప్రక్రియల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. 

భయం విస్తృతి ఎంతంటే!?
మనలోని 29శాతం మందిలో ఏదో ఒక అంశంపై ఫోబియా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఫోబియాలు మహిళల్లో రెట్టింపు మందిని బాధిస్తుంటాయి. 

ఫోబియాతో బాధపడే వ్యక్తుల భవిష్యత్తు... 
కాగ్నిటివ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి ఇతర ప్రక్రియలను కలుపుతూ చేసే చికిత్సలు, రిలాక్సేషన్ టెక్నిక్స్... వీటన్నింటి సహాయంతో ఇప్పుడు ఫోబియాలను పూర్తిగా తగ్గించడం సాధ్యమే. 


ఫోబియా అంటే భయపడకూడని అంశాల పట్ల తీవ్రమైన భయం. చాలా మందికి చాలా విషయాల పట్ల భయాలు ఉంటాయి. ఉదాహరణకు తలుపులు వేసి ఉండే గదుల్లో ఉండటం కొందరికి భయం, అలాగే కొందరికి చాలా ఎత్తుకు ఎక్కడం భయం. కొందరికి హైవే పై డ్రైవింగ్, కీటకాలు, పాములు... ఆఖరికి సూదులన్నా కూడా భయమే. వాస్తవంగా చెప్పాలంటే ఏ అంశం గురించైనా అర్థం లేని భయాలు అభివృద్ధి చెందవచ్చు. ఇవి కొందరిలో చిన్నప్పట్నుంచే ఉంటే... మరికొందరిలో పెద్దయ్యాక అభివృద్ధి చెందవచ్చు. 

అందరిలోనూ సాధారణంగా భయం కలిగించని పరిస్థితికి, అర్థం లేకుండా, నిర్హేతుకంగా భయపడుతూ ఉండే కొందరు తమ భయాలకు తామే ధైర్యం చెప్పుకుంటూ, వాటిని అధిగమిస్తూ ఉంటారు. అయితే కొందరికి తాము భయపడుతున్న అంశాన్ని గుర్తుతెచ్చుకుంటేనే... అంటే సంకల్పమాత్రానే భయం వేస్తుంది. అలాంటిది ఆ పరిస్థితికి ఎక్స్‌పోజ్ అయితే అది మరింత తీవ్రతరమవుతుంది. 

పైన పేర్కొన్న నరాలను మెలిపెట్టే అలాంటి పరిస్థితిని తప్పుకోడానికి మనం నిత్యం చేయాల్సిన కొన్ని పనులను సైతం పక్కన పెట్టి వాటినుంచి పారిపోతూ ఉంటాం. ఇది జీవితంలో ఎన్నింటినో కోల్పోయేలా చేస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఉండటం అంటే భయం. ఫలితంగా తమ ఉద్యోగరీత్యా బహుళ అంతస్తుల్లో పైన ఉండాల్సి వస్తే ఉండే భయం వల్ల బాగా జీతం వచ్చే మంచి ఉద్యోగాన్ని వదిలేసుకోవాల్సి వస్తే?! ఇలాంటి భయం వల్లనే కొందరు కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఆఫీసును ఫ్లై ఓవర్ ఎక్కి దాటడానికి మనస్కరించక కనీసం 20 కి.మీ. అదనంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు పోయేవారున్నారు. నిజానికి ఈ భయాలు అర్థం లేనివి. పైగా వాటివల్ల కోల్పోయేది కూడా ఎంతో ఉంది. అలాంటప్పుడు ఆ భయా (ఫోబియా)లకు చికిత్స తీసుకోవడం అవసరమవుతుంది. 

భయం, ఫోబియాల మధ్య తేడా... 
ఏదైనా భయం గొలిపే పరిస్థితుల్లో భయం కలగడం అనేది సహజం. ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి లేదా వాటిని అధిగమించడానికి అది అవసరం కూడా. అంటే భయం అన్నది ఒక రక్షణ కల్పించే చర్య అన్నమాట. ఇక్కడ భయం వల్ల ఒక ప్రయోజనం నెరవేరుతుంది.

భయపడ్డప్పుడు మన శరీరం, మనసు అప్రమత్తంగా మారి ఏ రకమైన చర్యకైనా వెనకాడకుండా తయారవుతాయి. మన స్పందనలు, ప్రతిచర్యలు చాలా వేగవంతంగా మారి మనకు రక్షణ కల్పిస్తాయి. కానీ ఫోబియాలో అలా జరగదు. అక్కడ లేని ప్రమాదాన్ని రోగి ఊహిస్తుంటాడు. ఉదాహరణకు చాలా భయంకరమైన కుక్క ఎదురైనప్పుడు అది కరుస్తుందేమో అని భయపడటం సహజం. కానీ అది పెంపుడు కుక్క అయినా భయపడటం అర్థరహితం. డాగ్ ఫోబియా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.

సాధారణంగా మనలో ఉండే భయాలు, ఫోబియాలు
మనందరిలో సాధారణంగా ఉండే భయాలు, ఫోబియాలను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి... 
జంతువుల ఫోబియా... చాలామందికి పాములు, తేళ్ల వంటి విషజీవులు, సాలెపురుగులు, ఎలుకలు, కుక్కలంటే భయంగా ఉంటుంది. 

స్వాభావిక పరిసరాల్లో కొన్నింటి పట్ల ఉండే ఫోబియా... ఉదాహరణకు ఎత్తుకు ఎక్కాక కిందికి చూడటం వల్ల, తుఫానులు, చాలా విశాలమైన నీటిని, చిమ్మచీకటిని చూసినప్పుడు భయం కలుగుతుంది. 

పరిస్థితుల వల్ల కలిగే ఫోబియాలు: కొన్ని పరిస్థితుల్లో మనకు భయంగా ఉంటుంది. ఉదాహరణకు... తలుపులు మూసి ఉంటే (క్లాస్ట్రోఫోబియా), డ్రైవింగ్ సమయాల్లో, గుహల్లోకి ప్రవేశించినప్పుడు, బ్రిడ్జ్‌పైకి వెళ్లినప్పుడు. 

గాయం, రక్తం, ఇంజక్షన్ వంటి భయాలు: వైద్యచికిత్సలో చేసే ప్రక్రియలు అంటే ఇంజక్షన్ వంటి వాటికి భయపడుతుంటారు. చాలామందిలో నలుగురిలో మాట్లాడటం అన్నా, కీటకాలన్నా లేదా ఎవరికైనా జబ్బుగా ఉండటం లేదా చనిపోతారన్న భయాల వంటివి ఉంటాయి. 

ఫోబియా లక్షణాలు... 
ఏదైనా భయం కాస్తా ఫోబియాగా మారినప్పుడు మొదట యాంగ్జైటీ కలిగి అది తీవ్రమై (ప్యానిక్) చాలా తీవ్రంగా వ్యవహరిస్తారు. దీన్ని ఫుల్‌బ్లోన్ ప్యానిక్ ఎటాక్ అనుకోవచ్చు. మనం భయపడుతున్న విషయానికి ఎంత దగ్గరగా ఉంటే భయం తాలూకు తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. భయం ఎంత ఎక్కువగా ఉంటే దాని నుంచి బయటపడటం అంత కష్టమవుతుంది. ఈ లక్షణాలు సైతం రెండు రకాలుగా కనిపిస్తాయి. అవి... 

భౌతికంగా కనిపించే లక్షణాలు: ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడం గుండె వేగం అధికం కావడం ఛాతీలో నొప్పి లేదా ఛాతీ బిగదీసుకుపోవడం వణుకు నిద్రవస్తున్నట్లు లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడం కడుపులో తిప్పినట్లుగా / దేవినట్లుగా అనిపించడం ఒంట్లోంచి వేడి ఆవిరులు బయటకు వస్తున్నట్లుగా అనిపించడం చెమటలు పట్టడం... వంటివి
ఉద్వేగపూరితమైన లక్షణాలు: యాంగ్జైటీ ఎక్కువ కావడం ఆ తర్వాత ప్యానిక్‌గా మారడం అక్కడి నుంచి పారిపోవాలన్న బలమైన కాంక్ష మనలోంచి మనమే వేరైన అనుభూతి మనపై మనం అదుపు కోల్పోవడం కాసేపట్లో చచ్చిపోతామా అన్న ఫీలింగ్ ఒక విషయం పట్ల మనం మితిమీరి స్పందిస్తున్నామని తెలిసినా దాన్ని నియంత్రించుకోలేని శక్తి. 

ఫోబియాల వల్ల కలిగే దుష్ర్పభావాలు: ఫోబియాలకు చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే అవి వ్యక్తిగత జీవితాన్ని చాలా దుర్భరం చేస్తాయి. వాటిని దాచిపెట్టినా సరే... దాని ఫలితాలు మీ జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు విమాన ప్రయాణం అంటే భయం ఉంటే దాన్ని దాచితే జీవితంలో చాలా కోల్పోవచ్చు. అలాగే కొన్ని ఫోబియాల వల్ల వ్యక్తిగత జీవితంలో స్నేహితులకు, బంధువులకు దూరం కావడం, ఉద్యోగం కోల్పోవలసి రావడం వంటి తీవ్రపరిణామాలు సంభవించవచ్చు.

ఫోబియా ఉన్నవారు వాటిని అధిగమించదలచినప్పుడు క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. అంతేతప్ప... అకస్మాత్తుగా అంతా చక్కబడిపోదు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారికి మిగతా వారిలో పోలిస్తే ఫోబియాలకు గురయ్యే అవకాశాలు పదింతలు ఎక్కువ. అలాగే ఫోబియాలు ఉన్నవారు సైతం ఆల్కహాల్‌కు అలవాటు పడే అవకాశాలు సైతం రెండింతలు ఎక్కువ. ఒక్కోసారి ఫోబియా వల్ల కలిగే యాంగ్జైటీ (ఉద్విగ్నత) ప్రమాదకరమైన పరిస్థితికి, ఒక్కోసారి మరణానికి సైతం దారితీసే అవకాశం ఉంది. అది గుండెజబ్బులకూ దారితీయవచ్చు. 

ఫోబియా వర్గీకరణ ఇలా... సైకియాట్రిస్టులు ఫోబియాలను సాధారణంగా మూడు రకాలుగా వర్గీకరిస్తుంటారు. 
సామాజిక ఫోబియా (సోషల్ ఫోబియా): సాధారణంగా ఇవి అందరిలోనూ ఉండే సహజ భయాలే అయినా కొందరిలో మితిమీరి ఉంటాయి. ఉదాహరణకు కొందరు బయట తినడం అనే విషయం పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తూ దానివల్ల కలిగే పరిణామాలను అతిగా ఊహించుకుంటారు. సాధారణంగా సోషల్ ఫోబియాలు చికిత్సకు సైతం ఒకపట్టాన తేలిగ్గా లొంగవు. సామాజిక ఫోబియాలు తమకు చిన్నప్పుడు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా కలుగుతాయి. 

సాధారణంగా పదవ ఏటి కంటే ముందు ఎదురైన సామాజిక అవమానాల కారణంగా ఏర్పడ్డ భయాలు కొందరిలో కాలక్రమేణా తొలగిపోవచ్చు. కానీ యుక్తవయసులో తమ స్నేహితుల నిరాదరణకు గురైన కారణంగా ఏర్పడ్డ భయాలు మాత్రం అంత తేలిగ్గా తొలగిపోవు. అవి వయసుతో పాటు పెరుగుతూ పోవచ్చు. నిర్దిష్ట ఫోబియాలు (స్పెసిఫిక్ ఫోబియాస్): ఈ ఫోబియాలు నిర్దిష్టంగా ఫలానా అంశం వల్ల కలుగుతుండే భయాలు అని చెప్పవచ్చు. ఉదా. పాములు, నీళ్లు, ఎత్తులు, విమానప్రయాణం, రోగభయం... ఇలాంటివన్నమాట. 

అగారోఫోబియా: ఇది ఇంటికి దూరంగా ఉన్నప్పుడు లేదా మనకు సురక్షితంగా ఉన్న స్థలానికి దూరంగా ఉన్నప్పుడు కలిగే తీవ్రమైన భయాలు అని చెప్పవచ్చు. 
ప్యానిక్ అటాక్ అంటే...: ఏదైనా ఫోబియాకు గురై భయపడటంలోని తీవ్రత తారస్థాయికి చేరినప్పుడు కలిగే మానసిక స్థితిని ప్యానిక్ అటాక్‌గా చెప్పవచ్చు. ఇది కలిగినప్పడు కనిపించే లక్షణాలు... తీవ్రమైన భయం గుండెవేగంలోని తీవ్రత చాలా ఎక్కువగా పెరగడం శ్వాస అందకపోవడం వణుకు ఒక్కోసారి స్పృహతప్పడం చనిపోయినట్లుగా అనుభూతి చెందడం అక్కడి నుంచి పారిపోవాలన్న తీవ్రమైన కాంక్ష. 

ప్రతికూల ఆలోచనలను అధిగమించడం... 
వాస్తవానికి ఒక ఫోబియా స్థితిలో అసలు భయం కంటే... దానివల్ల కలిగే ప్రతికూల (నెగెటివ్) ఆలోచనల వల్లనే ఎక్కువగా భయం కలుగుతుంది. ఉదాహరణకు ఒక బ్రిడ్జి మీద వెళ్తుంటే... అది బాగానే ఉన్నా... ఒకవేళ కుప్పకూలితే అన్న ఆలోచన కలగగానే ఆ అనంతర పరిణామాలను ఊహించడం వల్ల కలిగే భయమే ఎక్కువ. 

కాబట్టి ఇలాంటి అనవసరమైన ప్రతికూల ఆలోచనలను దూరం చేసుకుంటే భయాలు కలగనే కలగవు. అలాగే కొన్ని సాధారణ ఆలోచనలనూ వదులుకోవాలి. అంటే... కుక్కలన్నీ కరుస్తాయి. ఎద్దులన్నీ పొడుస్తాయి వంటి జనరలైజ్‌డ్ ఆలోచనలు వద్దు. ఒక ఉత్పాతం తప్పనిసరిగా జరుగుతుందని అనుకోవద్దు. ఉదాహరణకు మీరు విమానంలో ఉంటే అది తప్పక కూలిపోతుందేమోనని లేదా ఒకరికి దగ్గు వస్తే అది తప్పక స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనని... ఇలాంటి ఆలోచనలు వద్దు. 

ఏ వయసు పిల్లల్లో 
ఎలాంటి భయాలు...?
పిల్లల్లో సాధారణంగా కొన్ని కొన్ని వయసుల్లో కొన్ని విషయాలంటే భయం అధికంగా ఉంటుంది. అవి... 

0 - 2 ఏళ్ల పిల్లల్లో... పెద్ద శబ్దాలు, అపరిచితులు, తల్లిదండ్రుల నుంచి విడిగా ఉండాల్సి రావడం, పెద్ద పెద్ద వస్తువులంటే భయం. 

3-6 ఏళ్ల పిల్లల్లో... దెయ్యాలు, భూతాల వంటి అభూత కల్పనాత్మక పాత్రలంటే భయంతో పాటు ఒంటరిగా పడుకోవాల్సి రావడం, వింత శబ్దాలంటే భయంగా ఉంటుంది.

7- 16 ఏళ్ల పిల్లల్లో... ఇలాంటి పిల్లల్లో వాస్తవ విషయాలపట్ల అంటే ఆడుతున్నప్పుడు గాయాల భయాలు, జబ్బు భయాలు, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ, స్కూల్లో పెర్‌ఫార్మెన్స్ తగ్గుతున్నప్పుడు కలిగే భయాలు, ప్రకృతి విలయాలు, స్వాభావిక ఉత్పాతాలంటే భయాలు ఉంటాయి. 

అధిగమించండిలా...
మీరు ఎలాంటి పరిస్థితుల్లో భయపడుతున్నారో ఆ జాబితాను తయారుచేసుకోండి. ఉదాహరణకు మీకు విమాన ప్రయాణం అంటే భయమనుకోండి. మీరు ఆ క్రమంలో జరిగే అనేక పనులను ఒక జాబితాగా రాయండి.

ఉదా: మీరు టికెట్ బుక్ చేస్తారు. ఆ తర్వాత ప్యాకింగ్, ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం, అనంతరం సెక్యూరిటీ చెక్‌కు వెళ్లడం, విమానం దిగడం - ఎగరడం చూడటం, విమానంలోకి ఎక్కడం (బోర్డింగ్), భద్రత కోసం ఫ్లైట్ అటెండెంట్స్ చెప్పే భద్రత చర్యలను పాటించడం... ఇక ఒక్కోదశలో జరిగే ప్రమాదాలను విశ్లేషించుకోండి. మీకు విమానం ఎగిరే దశలో చాలా కొద్దిపాటి రిస్క్ తప్ప మరేదశలోనూ సమస్య ఎదురవ్వదని అర్థమవుతుంది. అలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్న కొద్దీ భయం తొలగిపోతుంది. 

హైపోకాండ్రియాసిస్...
కొందరిలో ఈ భయాలు పెచ్చుమీరి తమకు ఏదైనా ఆరోగ్యసమస్య ఉందేమో అని అనుమానిస్తుంటారు. ఈ అనుమానం కాస్తా పెనుభూతమై తమకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా ఊహించుకుని భయపడుతుంటారు. అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకుంటూ, అందులో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాకపోయినా లేని లక్షణాలను ఉన్నట్లుగా ఊహించుకుంటూ బాధపడుతుంటారు.

మాటిమాటికీ పరీక్షలు చేయించుకోడానికి సూదులతో గుచ్చడం వల్ల పడే దుష్ర్పభావాలు, నొప్పి నివారణ మందులు వాడటం, యాంగ్జైటీని తగ్గించే మందులు వాడటం, సమస్య లేకపోయినా మాటిమాటికీ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ విలువైన తమ సమయాన్ని వృథా చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి భయాలను కూడా మంచి కౌన్సెలింగ్‌తో తొలగించడం సాధ్యమే.

ఫోబియాలకు చికిత్స...
ఫోబియాకు సమర్థమైన చికిత్స సైకోథెరపీ (కౌన్సెలింగ్). దీనితో పాటు మందులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండూ అవసరమవుతాయి. మీ భయాన్ని మీరే ఎదుర్కోండి. మనకు ఏదంటే భయమో ఆ విషయాన్ని మనకు మనమే మెల్లగా ధైర్యం చెప్పుకుంటూ ఎదుర్కొంటూ ఉండాలి. ఈ ప్రయత్నంలో ఫోబియా అన్నది మనం భయపడుతున్నంత భయంకరమైనది కాదని అనిపిస్తున్నకొద్దీ ఫలితం మరింత మెరుగవుతూ పరిస్థితులు మీ అదుపులోకి వచ్చేస్తాయి. 

కొన్నిసార్లు కేవలం 1 నుంచి 4 సెషన్స్‌లోనే ఫలితం వచ్చేస్త్తుంది భయాలను క్రమంగానూ, మాటిమాటికీ ఎదుర్కోవడం... మీకు ఏ విషయం గురించి భయమో దాన్ని నేరుగా ఒకేసారి కాకుండా... క్రమంగా, మాటిమాటికీ ఎదుర్కొంటూ పోతే అది మీరు ఊహించినంత భయంకరమైనది కాదని అర్థమవుతున్న కొద్దీ మీరు మీ భయాన్ని అధిగమిస్తూ, మీ ఫీలింగ్స్‌పై ఆధిక్యత సాధిస్తారు. 

రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోవడం... 
మనకు ఏదైనా విషయంలో భయం వేయగానే ఉద్విగ్నత (యాంగ్జైటీ) కలుగుతుంది. దానివల్ల గుండెవేగం పెరగడం, ఊపిరి ఆడనట్లుగా ఉండటం (సఫొకేటింగ్) వంటి భౌతిక లక్షణాలు కనిపిస్తాయి. వీటివల్ల మన భయం మరింతగా పెరిగినట్లయి, నిరాశలోకి కూరుకుపోతారు. అందుకే యాంగ్జైటీని అధిగమించే ప్రయత్నంలో భాగంగా రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను నేర్చుకుని అవలంబించడం వల్ల క్రమంగా ఉద్విగ్నతను, ప్యానిక్ ఫీలింగ్స్‌ను, భయాన్ని ఎదుర్కొనవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో బలంగా ఊపిరిపీల్చడం (డీప్ బ్రీతింగ్), ధ్యానం, యోగా వంటి వాటితో ఉద్విగ్న పరిస్థితుల్లోనూ స్థిమితంగా ఉండటం ప్రాక్టీస్ చేయవచ్చు. 

కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ): ఫోబియాలను గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడే చికిత్స ప్రక్రియ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. సీబీటీ అంటే ఒకరకమైన కౌన్సెలింగ్. దీనితో పాటు మందులు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యాంటీ డిప్రెసెంట్స్, బీటా బ్లాకర్ మెడిసిన్స్, బెంజోడయాజిపైన్స్ వంటి మందులతో పాటూ సీబీటీ చేయాల్సి ఉంటుంది.

Sunday, February 17, 2013

Mr & Mrs. Puvvada Nageshwara rao


రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తిగా, సి.పి.ఐ ఫ్లోర్ లీడర్‌గా, ఎమ్.ఎల్.ఎగా, ఎమ్.ఎల్.సిగా రాష్ట్ర ప్రజలకు ఆయన చిరపరిచితులు. పేరు పువ్వాడ నాగేశ్వరరావు. ఆయన రాజకీయ జీవితానికి అరవై ఏళ్లు,వైవాహిక జీవితానికి యాభై ఏళ్లు నిండాయి. ఆయన సతీమణి విజయలక్ష్మి. భర్త ప్రతి అడుగులోనూ ఒద్దికగా నిలిచిన ఇల్లాలు. ఖమ్మం జిల్లాలో ఉంటున్న ఈ దంపతులను కలిసిసినప్పుడు- ‘కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లితేనే సమాజం సుసంపన్నంగా ఉంటుంది’ అన్నారు. వివాహం తమ జీవితానికి ఎంతటి నిండుదనాన్ని తీసుకువచ్చిందో వివరించారు. వారి దాంపత్య విశేషాలే ఇవాళ్టి బెటర్ హాఫ్...

ఇద్దరివీ కమ్యూనిస్టు కుటుంబాలే! నిరుపేదల పక్షాన నిలిచి ఉండే వ్యక్తుల నడుమ పెరిగినవారే! అప్పటికి అమ్మాయి ఇంటర్మీడియట్, అబ్బాయి డిగ్రీ పూర్తి చేశారు. పెద్దలు కుదిర్చిన సంబంధమే! కలిగిన కుటుంబాలే అయినా పెద్దలు వీరిని 1963 ఫిబ్రవరి 14న నిరాడంబరంగా దండల పెళ్లితో ఒక్కటి చేశారు. ‘ఈ రోజుల్లో పెళ్లిని ఆడంబరంగా చేసుకోవడానికి ఇచ్చినంత ప్రాధాన్యత జీవితాన్ని అందంగా మలుచుకోవడంలో చూపించడంలేదు’ అన్నారు నాగేశ్వరరావు. ‘భార్యా భర్త ఎక్కువ తక్కువలనే భావాలకు తావివ్వకుండా ఎవరి పనులు వారు సవ్యంగా చూసుకుంటూనే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటే ఏ దాంపత్యమైనా కలకాలం నిలుస్తుంది’ అన్నారు విజయలక్ష్మి. 

ఇప్పటికీ మరవని ప్రేమ

పువ్వాడ: ఈ ఏడాది నుంచే నేను కాస్త లీజర్‌గా ఉంటున్నాను. అంతకుముందు ఏ టైమ్‌కు ఎక్కడ ఉండేవాణ్ణో నాకే తెలియనంత బిజీగా గడిపాను. ఇంటి బాధ్యతలన్నీ ఈవిడే చూసుకునేది. మేం ముగ్గురం అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. అయినా ఏనాడూ ఫలానా సమస్య అని నేను ఇంటికి రాగానే చెప్పినట్టు, నేను చిరాకు పడిన ట్టు ఒక్కటీ గుర్తులేదు. పైగా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇంటికి వచ్చినా ఓపిగ్గా వండి పెట్టేది. ఇప్పుడు ఈమెకు డెభ్బై ఏళ్లు. నేను వారించినా ఇంట్లో పనివాళ్లు, కోడళ్లు ఉన్నా నాకు అవసరమైన వాటిని ఈవిడే దగ్గరుండి చూస్తుంది. నేనింతవరకు షాపింగ్ చేసిందే లేదు. కర్చీఫ్ దగ్గర నుంచి కాలికి ధరించే సాక్స్‌ల వరకు అన్నీ ఓర్పుగా కొని తెస్తుంది. నాకు బి.పి, షుగర్.. ట్యాబ్లెట్లు అన్నీ విడివిడిగా ప్యాకెట్లలో పోసి, వాటి మీద టైమ్, వివరాలన్నీ రాసి ఉంచుతుంది. భర్త అవసరాలు చూడటమేనా భార్య అంటే కాదు, బాధ్యతతో కూడిన ప్రేమ ఇల్లాలిది. డెభ్బై ఐదేళ్లకు కూడా నేనింత బాగున్నానంటే ఆ ప్రేమ మా లక్ష్మిలో ఉండబట్టే! 

విజయలక్ష్మి: ముగ్గురు తోబుట్టువుల మధ్య పెరిగాను. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో మా అమ్మ ద్వారా గ్రహించాను. ఈయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా చెప్పిన టైమ్‌కి రాకపోతే ఏమీ అనరు. మరో పనికి వెళ్లిపోతారు. అవతలి వారే ఈయన నిబద్ధతను అర్ధం చేసుకుని నడుచుకుంటారు. అలా నేనూ ఈయనకు అనుగుణంగా నా పద్ధతులను మార్చుకున్నాను. ఈయన బయట ఎంతోమంది మధ్య తిరిగే వ్యక్తి. ఇంటికి ఎంత ఒత్తిడితో వస్తారో నాకు తెలుసు. అందుకే ఇంటి చికాకులేవీ ఈయన ముందుకు తెచ్చేదాన్ని కాదు. అలాగే ఈయన బయట చికాకులు, గొడవలు, పదవులు... ఎన్నడూ ఇంటికి తెచ్చేవారు కాదు. కసుర్లు, విసుర్లు, మాట విరుపులు ఎప్పుడైనా నీటి మీద బుడగల్లా వచ్చిపోయేవే తప్ప మనసు కష్టపెట్టిన మాట ఒక్కటీ గుర్తుకులేదు. ఈయన చేతుల మీదుగా వేదికలపై వందల పెళ్లిళ్లు చేశారు. ఆ సందర్భంలో ఎప్పుడూ ఒక మాట చెబుతారు. ‘కుటుంబం ఆనందంగా ఉంటేనే సమాజం బాగుంటుంది’ అని. అదే నా భావన కూడా! 

ఆటపాటల హరివిల్లు

పువ్వాడ: దాంపత్యబంధానికి బలం చేకూర్చేది పిల్లలే! మాకు ఇద్దరు అబ్బాయిలు. ఉదయ్‌కుమార్, అజయ్‌కుమార్. వారి పెంపకం బాధ్యతలో నా పాత్ర చాలా తక్కువ! పొద్దున లేచింది మొదలు పార్టీ పనులంటూ వెళ్లిపోయేవాడిని. వారి చదువులన్నీ లక్ష్మీయే చూసుకుంది. అబ్బాయిలే అయినా ఎవరిసాయం లేకుండా వారి పనులు వారే సొంతంగా చేసుకునేలా అలవాటు చేసినట్టు చాలాసార్లు గ్రహించాను. అందుకే కాలేజీ స్థాయికి వచ్చాక పెద్దవాడు రష్యాలో ఆరేళ్లు, చిన్నవాడు బెంగుళూరులో రెండేళ్లు ఉండి తమ పనులు తాము చేసుకుంటూ చదువుకోగలిగారు. 

విజయలక్ష్మి: ఈయన బయట ఎన్ని పనులు ఉన్నా, ఇంటికి వస్తే చిన్నపిల్లాడైపోయేవారు. పిల్లలిద్దరినీ చెరో వైపు భుజం మీద కూర్చోబెట్టుకొని తిప్పిన రోజులు ఇప్పటికీ కళ్లకు కట్టినట్టున్నాయి. ఇద్దరినీ ఒళ్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. ఈయనకు పిల్లల్ని డాక్టర్లను చేయాలని ఉండేది. కాని ఆ ఇష్టాన్ని ఎప్పుడూ వారిమీద చూపించలేదు. పిల్లలు స్వేచ్ఛగా తమకు నచ్చినవే ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. పిల్లలు కూడా ఏం చేయాలనుకున్నా ముందుగా ఈయనతోనే చర్చించేవారు. పెద్దవాడు ఉదయ్ పార్టీలోనే చురుగ్గా పాల్గొనేవాడు. చిన్నవాడు హైదరాబాద్‌లో ప్రెస్ పెట్టుకున్నా డు. ఇప్పుడు రాష్ట్రంలోనే పెద్ద పేరున్న (మమతా మెడికల్ కాలేజీ) మెడికల్ కాలేజీని నిర్వహిస్తున్నాడు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ విషయంలోనూ వాడి ఇష్టానికే స్వేచ్ఛను ఇచ్చారీయన. 

కలసి ఉంటే కలదు సుఖం

పువ్వాడ: ఎవరి పెళ్లికైనా వెళ్లడం మినహా నేనెలాగూ ఎవరికీ అందుబాటులో ఉండేవాడిని కాదు. నా బంధువులు, తన బంధువులు అనే భేదం లేకుండా ఎవరొచ్చినా ఈవిడే చూసుకునేది. మా చెళ్లెళ్లు, వారి పురుళ్లు, పెట్టుపోతల విషయాలు.. ఈవిడే చూసుకుంది. ఇప్పటికీ కోడళ్లను కూతుళ్లలా చూసుకుంటుంది. వెయ్యి రూపాయలిచ్చినా దాంతోనే ఆ నెలంతా ఇల్లు నడిపేది. ఇంత తక్కువా అన్నది కూడా ఎన్నడూ లేదు. ఇల్లాలిని బట్టి ఇల్లు ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. 

విజయలక్ష్మి: ఈయన ఏనాడూ దేనికీ ఆంక్షలు పెట్టింది లేదు. డబ్బు విషయంలోనూ అంతే! పదివేలు ఇచ్చినప్పుడు దాచి, వెయ్యి రూపాయలే ఇచ్చినప్పుడు సర్దిపుచ్చేదాన్ని. సంపాదించేది ఒక్కరు, తినేవి పది నోళ్లు. ఆ మాత్రం సర్దుబాటు ఇల్లాలిగా నాకు లేకపోతే అవస్థలు పడతామని తెలుసు. అందుకే పొదుపు పాటించేదాన్ని. ఈయనలో అమితంగా నచ్చే అంశం ఎవరైనా సరే స్వేచ్ఛగా ఉండాలంటారు. మా పిల్లల పెళ్లిళ్ల విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మా పెద్దబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఈయన వెంటనే సరే అన్నారు. ఈయన మాటే నా మాట. వాడిష్టప్రకారమే దండల పెళ్లి చేశాం. కొడుకులే కాదు కోడళ్లూ చదుకోవాలని, వారి చేత డిగ్రీలు చేయించారు. ఇల్లాలు చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది అనేవారు. 

కష్టాలలో తోడూనీడ

పువ్వాడ: పెద్దవాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోదామనుకున్నారు. అప్పుడు ఈవిడా, నేను చాలా బాధపడ్డాం. వారిద్దరినీ కలిపి ఉంచడానికి చాలా ప్రయత్నించాం. వారింటికి వెళ్లి నచ్చజెప్పాం కూడా. కాని అప్పటికే వారిద్దరూ నిర్ణయం తీసేసుకున్నారు. విడిపోయారు. ఆ సమయంలో ఈవిడ నాకు ఎంతో మనోధైర్యాన్ని కలిగించింది. 

విజయలక్ష్మి: పెద్దబ్బాయి రెండో పెళ్లి విషయంలోనూ ఈయన వాడి స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈయన తీసుకునే నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో నాకు చాలా సార్లు రుజువు అయ్యింది. జీవితంలో స్థిరపడడానికి ఉదయ్, అజయ్ చాలా కష్టాలు పడ్డారు. వారి అవస్థలు చూసి నాకు బాధ కలిగేది. ‘ఎదుగుదలలో శ్రమ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది’ అని ఈయన నాకు తరచూ చెబుతూండేవారు. ఆ మాటలు నాకు ఎంతో ఊరట కలిగించేవి. ఆ తర్వాత వాళ్లూ వృద్ధిలోకి వచ్చి మమ్మల్ని సంతోషపెట్టారు. ఆరేళ్ల క్రితం మా పెద్దబాబు ఉదయ్ ప్రమాదవశాత్తు మరణించాడు. వాడి జ్ఞాపకాలే ఇంకా మమ్మల్ని వీడటం లేదు. ‘ఎంతటివారైనా విధికి తలవంచాలి, తప్పదు’ అని పుట్టెడు దుఃఖంతో ఉండీ ఈయన నాకు ధైర్యం చెప్పారు. ఏ ఇల్లాలైనా భర్త నుంచి ధైర్యం, నమ్మకం, గౌరవం కోరుకుంటుంది. అవన్నీ ఈయన నుంచి అందుకున్న నేను అదృష్టవంతురాలిని. 

వివాహం ఇద్దరు వ్యక్తులనే కాదు, రెండు కుటుంబాలను కలిపే బంధం. కుటుంబం చుట్టూ, బాధ్యతల చుట్టూ అల్లుకుపోయే అనుబంధం. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఆ బంధం శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై ఎందరికో నీడనిస్తుంది. ఆ చల్లదనం అందించే హాయిని ఇప్పుడు ఎన్నో జంటలు ఆస్వాదిస్తున్నాయి. కష్టసుఖాలను సమంగా పంచుకోమని ఈ దంపతులు చెప్పే నాలుగు మంచి మాటలు ఎన్నో జంటలకు సరైన దారిని చూపుతున్నాయి. 

బాధ్యతతో కూడిన ప్రేమ ఇల్లాలిది. ఆ ప్రేమ మా లక్ష్మిలో చూశాను.
- పువ్వాడ నాగేశ్వరరావు

ఏ ఇల్లాలైనా భర్త నుంచి ధైర్యం, నమ్మకం, గౌరవం కోరుకుంటుంది. అవన్నీ ఈయన నుంచి అందుకున్న నేను అదృష్టవంతురాలిని.
- విజయలక్ష్మి